: భారత్ లోకి చైనా బలగాల చొరబాటు
ఓ వైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు ఝీ జిన్ పింగ్ లు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే పనిలో నిమగ్నమై ఉండగా, చైనా బలగాలు మరోసారి వాస్తవాధీన రేఖ దాటి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. లడఖ్ పరిసరాల్లోని దంచోక్ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో చైనా సైనికులతో కూడిన రెండు వాహనాలు వాస్తవాధీన రేఖను దాటేశాయి. ఈ సందర్భంగా వారికి ఎదురుపడ్డ భారత సైనికులు, విషయాన్ని తెలియజెప్పే క్రమంలో సైనిక కవాతు నిర్వహించారు. దీంతో చైనా సైనికుల వాహనాలు వెనుదిరిగాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో రెండు పర్యాయాలు చైనా వైమానిక దళ హెలికాఫ్టర్లు భారత గగనతలంలోకి దూసుకొచ్చిన నేపథ్యంలో భారత్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.