: గుంటూరుకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతిపై అనుమానాలు


గుంటూరుకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ లో సూరజ్ సింగ్ తో తమ కుమార్తె చాలా రోజుల నుంచి పరిచయం పెంచుకుందని అంటున్నారు. ఈ క్రమంలోనే రాత్రివేళ మోటార్ సైకిల్ పై స్వాతిని తీసుకెళ్లి హత్యచేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన స్వాతి నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. మాజీ సైనికోద్యోగి అయిన తండ్రి మరణించడంతో వచ్చే పింఛనుతో తల్లి పినిపే సంధ్యారాణి, కూతురు స్వాతి జీవనం సాగిస్తున్నారు. ఈమధ్యే మొదటి ఏడాది రెండో సెమిస్టరు పరీక్షలు రాసిన స్వాతి సెలవులకు ఇంటికి వచ్చింది. ఐదు రోజుల కిందట గుంటూరుకు చెందిన మరో మాజీ సైనికోద్యోగి రాజ్ సింగ్ కుమారుడు సూరజ్ సింగ్ అనే యువకుడు ఫేస్ బుక్ లో ఆమెకు పరిచయమయ్యాడు. అలా ఇరువురి ఫోన్ నంబర్లు తీసుకున్నారు. ట్రిపుల్ ఐటీ రెండవ సంవత్సరం చేరేందుకు నిన్న (సోమవారం) మధ్యాహ్నం స్వాతి తల్లితో కలసి గుంటూరు వెళ్లింది. అక్కడ నుంచి స్నేహితులతో కలసి వెళతానని చెప్పడంతో తల్లి వెళ్లిపోయింది. వెంటనే స్వాతి ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడు సూరజ్ ను కలిసింది. ఇద్దరూ ఏడున్నర వరకు మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి 8.30 గంటల సమయంలో గుంటూరు నుంచి బయలుదేరారు. కళాశాలకు చేరుకునేసరికి రాత్రి 12.30 అయింది. ఆ సమయంలో హాస్టల్లోకి అనుమతించమని అక్కడి సెక్యూరిటీగార్డు నిరాకరించాడు. దాంతో, స్వాతి, సూరజ్ తిరిగి గుంటూరు బయలుదేరారు. మంగళగిరి చినకాకాని వద్దకు వచ్చాక స్వాతి చున్నీ మోటారుసైకిల్ వెనుక చక్రంలో చిక్కుకోవడంతో అదుపు తప్పి ఆమె బైక్ మీద నుంచి కిందకు పడిపోయింది. తలకు బలంగా దెబ్బ తగలడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News