: టీమిండియాను వణికిస్తున్న 'లార్డ్స్' భూతం!
ఇంగ్లండ్ టూర్ లో టీమిండియా ముందు కఠిన పరీక్ష నిలిచింది. సుప్రసిద్ధ లార్డ్స్ స్టేడియం వేదికగా రేపటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. ధోనీ సేన తొలి టెస్టులో మెరుగైన ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ఈ మ్యాచ్ కు సన్నద్ధమైనా... గణాంకాలు మాత్రం భీతిగొలిపే రీతిలో ఉన్నాయి. ఈ మైదానంలో 82 ఏళ్ళ క్రితం అడుగుపెట్టిన భారత్ ఇప్పటివరకు 16 టెస్టులాడింది. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ కేవలం ఒక్క టెస్టులోనే గెలవగలిగింది. 11 మ్యాచ్ లలో ఓటమిపాలవగా, నాలుగింటిని డ్రా చేసుకుంది. ఆ ఒక్క గెలుపు కూడా ఎప్పుడో 28 ఏళ్ళ క్రితం సాధించినదే. ఈ నేపథ్యంలో లార్డ్స్ లో మ్యాచ్ భారత్ కు నల్లేరుపై నడక కాదన్న విషయం బోధపడుతోంది. ఇక్కడి పిచ్ పేసర్లకు విశేషంగా సహకరిస్తుంది. 2000-2007 మధ్య కాలంలో పేసర్లు ఈ మైదానంలో 145 వికెట్లు తీయగా, స్పిన్నర్లు 52 వికెట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇన్ని ప్రతికూలతలను ధోనీ అండ్ కో ఎలా అధిగమిస్తుందో చూడాలి.