: జానా Vs పొన్నాల... టీ కాంగ్రెస్ లో ఎక్కువైన ఆధిపత్య పోరు
ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డీలా పడి ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడం మరచిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆధిపత్యం కోసం కత్తులు నూరుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై మొదటి నుంచి గుర్రుగా ఉన్న సీఎల్పీ నేత జానారెడ్డి పార్టీ పగ్గాలను చేపట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వచ్చే నెల 4న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు, బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ లాంటి అంశాలు సమావేశ ప్రధాన అజెండాగా ఉన్నప్పటికీ... పొన్నాలను టార్గెట్ చేయడానికే ఈ సమావేశమనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ జానారెడ్డి... అప్పటి నుంచి పొన్నాల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ కు దీటుగా పార్టీని పొన్నాల నడిపించలేకపోయారనే అంశాన్ని జానా హైలైట్ చేస్తున్నారు. మరోవైపు జానా వ్యవహారంపై పొన్నాల మండిపడుతున్నారు. తనను పలుచన చేసేందుకే జానారెడ్డి సమావేశం ఏర్పాటు చేస్తున్నారని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ హైకమాండ్ దృష్టికి పొన్నాల తీసుకెళ్లినట్టు సమాచారం.