: కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యే ఏపీ రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య ఏర్పాటు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు.రాజధాని నిర్మాణం ప్రపంచస్థాయిలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని తెలిపారు.నూతన రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ఓ గ్రాండ్ డిజైన్ ను రూపొందిస్తున్నారని ఆయన తెలిపారు.రాజధాని నిర్మాణ అధ్యయనానికి ఈ నెలాఖరులోగా సింగపూర్ వెళతామని నారాయణ అన్నారు.సింగపూర్ ప్రభుత్వం తమకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చిందని నారాయణ పేర్కొన్నారు మామూలు స్థాయి రాజధాని నిర్మాణానికి రూ.94 వేల కోట్లు సరిపోతాయని,అదే ప్రపంచస్థాయిలో రాజధాని నిర్మాణం జరగాలంటే రూ.లక్షా యాభై వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాజధానికి 184 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.