: పోలవరంపై అప్పుడేం చేశారంటూ కేసీఆర్ కు కిషన్ రెడ్డి ప్రశ్న
పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం పొందడంపై బీజేపీని నిందించడాన్ని ఆ పార్టీ తెలంగాణ నేత కిషన్ రెడ్డి తప్పుపట్టారు. పోలవరం ముంపు ప్రాంతాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో మౌనంగా ఉండి ఇప్పుడు మాట్లాడటమేంటన్నారు. తెలంగాణ వచ్చిన సమయంలో కుటుంబంతో కలసి సోనియాగాంధీ, ప్రధాని నరేంద్ర మోడీని కలసినప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలపై కేసీఆర్ ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన, మొదట్లో తెలంగాణ వస్తే చాలనుకునే ఆలోచనలో కేసీఆర్, జైపాల్ రెడ్డి ఉన్నారని... ఇప్పుడు బీజేపీని విమర్శించడం సరికాదనీ అన్నారు. అసలు తమపై వ్యాఖ్యానించే నైతిక హక్కు కూడా వారికి లేదన్నారు. బీజేపీ ఆఫీసులపై దాడి కూడా సరైంది కాదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పోలవరం నిర్ణయం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ త్వరగా నిర్వహించాలని, 9.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని కిషన్ రెడ్డి అన్నారు.