: వైదిక్ ఆరెస్సెస్ మనిషే: రాహుల్ గాంధీ
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ తో భేటీ అయిన వేద్ ప్రతాప్ వైదిక్ ఆరెస్సెస్ మనిషేనని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయిన వేద్, సయీద్ ను కలిసిన అంశం సోమవారం రాజ్యసభలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయి వివరాలను అందించాల్సిందేనని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాహుల్ ఈ విషయంపై మాట్లాడారు. "వైదిక్ ముమ్మాటికీ ఆరెస్సెస్ మనిషే. ఇది జగమెరిగిన సత్యం. సయీద్ తో ఆయన భేటీకి విదేశాంగ శాఖ ఎలా సహకరించిందన్న అంశం కూడా తెలుసుకోవాలని ఉంది" అని రాహుల్ వ్యాఖ్యానించారు.