: ఉద్యోగులను చంపేసిన వార్తాపత్రిక యజమాని
త్రిపురలో ఓ వార్తాపత్రిక ఎడిటర్ ముగ్గురు ఉద్యోగులను హత్యచేసినట్టు తేలింది. దైనిక్ గందూట్ అనే పత్రిక యజమాని-ఎడిటర్ సుశీల్ కుమార్ చౌధరీ తన సంస్థలోనే పనిచేస్తున్న మేనేజర్ రంజిత్ చౌధరీ, ప్రూఫ్ రీడర్ సుజిత్ భట్టాచార్జీ, డ్రైవర్ బలరాం ఘోష్ అనే ముగ్గురు ఉద్యోగులను హత్య చేశాడని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ మేరకు అగర్తలా కోర్టులో ఆధారాలు ప్రవేశపెట్టగా, సుశీల్ కుమార్ ను దోషిగా నిర్ధారించారు. సుశీల్ కుమార్ చాలా హై ప్రొఫైల్ వ్యక్తి అని, గతంలో రాష్ట్రపతులు, ప్రధానులు విదేశీ టూర్లకు వెళ్ళేటప్పుడు వారివెంట ఉండే మీడియా బృందంలో ఈయన కూడా ఉండేవాడని తెలుస్తోంది. అయితే, అక్రమ భూదందాల్లో తలదూర్చడంతో ఆ రహస్యాలు వెల్లడి చేస్తాడేమోనని తొలుత మేనేజర్ ను చంపాడు సుశీల్ కుమార్. ఆ ఘోరానికి సాక్ష్యులైన ప్రూఫ్ రీడర్, డ్రైవర్ లను సైతం హత్యచేశాడు. ఈ ముగ్గురి మృతదేహాలు చౌధరీ చాంబర్లోనే పడి ఉండడంతో అనుమానాలు అతడిపైకే మళ్ళాయి. అయితే, తనను లక్ష్యంగా చేసుకుని కొందరు ఈ హత్యలు చేశారని తొలుత బుకాయించాడు సుశీల్ కుమార్. అయితే, ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నది చెప్పలేకపోయాడు. కాగా, హత్యల సమయంలో అక్కడ డ్రైవర్ భార్య కూడా ఉన్నట్టు తెలిసింది. ఆమెను అరెస్టు చేసి విచారించగా, అప్రూవర్ గా మారి సుశీల్ కుమార్ గుట్టు రట్టు చేసింది. అయితే, తొలుత ఆమె సుశీల్ కుమార్ కు వంతపాడడం గమనార్హం. సుశీల్ కుమార్ కు మరణశిక్ష గానీ, జీవితఖైదు గానీ విధించే అవకాశాలున్నాయి.