: రిలయన్స్ పై మరో 579 మిలియన్ డాలర్ల జరిమానా
కృష్ణ, గోదావరి చమురు క్షేత్రాల్లో నిర్దేశించిన పరిమాణం మేర చమురును వెలికితీయనందుకు రిలయన్స్ పై కేంద్రం మరోమారు పంజా విసిరింది. కేజీ డీ-6 బావికి సంబంధించిన ఈ వివాదంపై ఇప్పటికే రిలయన్స్ కు పలుమార్లు జరిమానా విధించిన కేంద్రం, తాజాగా మరో 579 మిలియన్ డాలర్ల మేర జరిమానాను విధించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్ సభలో వెల్లడించారు. తాజా జరిమానాతో ఇప్పటిదాకా రిలయన్స్ పై కేంద్రం విధించిన జరిమానా మొత్తం 2.376 బిలియన్ డాలర్లకు చేరింది. నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఈ మొత్తాన్ని రిలయన్స్ ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంది. తాను ప్రతిపాదించిన మేరకు ధర పెంచలేదనే కారణంగా రిలయన్స్, ఉద్దేశపూర్వకంగానే గ్యాస్ వెలికితీతను తగ్గించిందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.