: సత్య నాదెళ్లతో దోస్తీకి ఇద్దరు చంద్రుల పోటాపోటీ


తెలుగుతేజం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వచ్చేనెలలో భారత్ పర్యటనకు రానున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా సత్య నాదెళ్ల హైదరాబాదులో కొన్ని రోజులు బస చేయనున్నారు. సత్య నాదెళ్ల హైదరాబాదులో ఉన్న సమయంలో ఆయనతో భేటీ అయ్యేందుకు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్ రావు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక, హైదరాబాద్ నగరంలో బస చేసే సమయంలో ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబులతో వేర్వేరుగా సమావేశమవ్వాలని సత్య నాదెళ్ల భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ తమ రాష్ట్రాల్లో ఐటీ పెట్టుబడులు సాధించుకునేందుకు మైక్రోసాఫ్ట్ సీఈవో మద్దతు కోరనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో బాగా అభివృద్ధి చెందింది. సత్య నాదెళ్ల రాకతో హైదరాబాదులో ఐటీ పరిశ్రమ విస్తరణ అవకాశాలు మరింత మెరుగుపడతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మైక్రోసాఫ్ట్ కూడా హైదరాబాదులో తమ కంపెనీ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక చంద్రబాబు కూడ ఏపీలో ఐటీ సెక్టార్ డెవలప్ మెంట్ కు సత్య నాదెళ్ల సహకారం కోరనున్నారు.

  • Loading...

More Telugu News