: టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పనున్న లంక దిగ్గజం
శ్రీలంక క్రికెట్ కు ఎన్నో ఏళ్ళుగా ఎనలేని సేవలందించిన మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం జయవర్థనే టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు జయవర్థనే అభిప్రాయాన్ని కూడా బోర్డు తన ఆ ప్రకటనలో పొందుపరించింది. గత 18 ఏళ్ళుగా దేశానికి ప్రాతినిధ్యం వహించి, ఇప్పుడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదని జయవర్థనే పేర్కొన్నాడు. అయితే, టెస్టులకు వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని తెలిపాడు. 37 ఏళ్ళ జయవర్థనే 145 టెస్టులాడి 11,493 పరుగులు చేశాడు. ఇప్పటికే టి20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ ఇక వన్డేల్లో మాత్రమే కనిపించనున్నాడు.