: సిమెంట్ ధరలను చూసి బెంబేలెత్తుతున్న బిల్డర్లు
సిమెంట్ కంపెనీల సిండికేట్ కు వ్యతిరేకంగా బిల్డర్లు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. భారీగా పెరిగిన సిమెంట్ ధరలకు వ్యతిరేకంగా సిమెంట్ కొనుగోళ్లను ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు బిల్డర్ల జేఏసీ నిలిపివేసింది. అయినప్పటికీ సిమెంట్ కంపెనీలు తమ మొండివైఖరిని వీడకపోవడంతో తదుపరి కార్యాచరణకు బిల్డర్ల జేఏసీ సిద్ధమైంది. దీనిలో భాగంగా సిమెంట్ కొనుగోళ్లను ఈ నెల 20 వరకు ఆపివేయాలని బిల్డర్ల జేఏసీ తీర్మానించింది. సిమెంట్ కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించి తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని బిల్డర్ల జేఏసీ ఆరోపించింది. పెరిగిన సిమెంట్ ధరలు బిల్డర్లతోపాటు, ఇల్లు కట్టుకుందామనుకునే ప్రతీ సామాన్యుడి ఆశలను అడియాస చేశాయని బిల్డర్ల జేఏసీ ఛైర్మన్ శేఖర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం పన్నులు ఏమాత్రం పెంచనప్పటికీ సిమెంట్ కంపెనీలు బస్తాకు దాదాపు 100 రూపాయల వరకు పెంచాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రతి చదరపు అడుగుకు రూ.200 నుంచి రూ.400 వరకు నష్టం వస్తుందని ఆయన అన్నారు. ఈ వారం రోజుల్లో సిమెంట్ ను కొనుగోలు చేయకుండా తమకు మద్దతిచ్చిన అన్ని వర్గాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.