: గురుద్వారా గోడ కూలి ఏడుగురు చిన్నారుల సజీవ సమాధి
మధ్యప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షం ఓ ఘోర ప్రమాదానికి కారణమైంది. వర్షపు నీటికి నాని, కూలిన గురుద్వారా గోడ కింద ఏడుగురు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. మరో తొమ్మది మంది తీవ్రంగా గాయపడ్డారు. తపతి నది ఒడ్డున ఉన్న బర్హాన్ పూర్ పట్టణంలోని రాజ్ ఘాట్- షికార్ పూర్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షంలో పూర్తిగా తడిసిన ఓ పురాతన కాలం నాటి గురుద్వారా గోడ పక్కనే ఉన్న చేనేత కార్మికులకు చెందిన మూడు ఇళ్లపై పడిపోయింది. దీంతో ఆ ఇళ్లలో నిద్రిస్తున్న ఏడుగురు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. వీరంతా 1-14 ఏళ్ల మధ్య వయసు వారే. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో ఇండోర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో శిథిలాల కింద సజీవ సమాధి అయిన పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు.