: పాక్ జాతీయ వారసత్వ సంపదగా నటుడు దిలీప్ కుమార్ ఇల్లు
బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ ను పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి ఘనంగా స్మరించుకుంది. పెషావర్ లో ఉన్న ఆయన ఇంటిని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించింది. దిలీప్ కుమార్ దేశవిభజనకు పూర్వం పెషావర్ లో జన్మించారు. పష్తూన్ తెగకు చెందిన ఆయన అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్. భారత్ కు వలస వచ్చిన అనంతరం సినిమా రంగంలో ప్రవేశించి పేరును దిలీప్ కుమార్ గా మార్చుకున్నారు. నటనారంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా పాకిస్థాన్ 1998లో 'నిషాన్-ఏ-ఇంతియాజ్' అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారం పాక్ లో అత్యున్నతమైనది. కాగా, దిలీప్ కుమార్ ఇంటిని వారసత్వ సంపదగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారని భారత్ లోని పాక్ హైకమిషన్ ప్రతినిధి మంజూర్ అలీ మెమన్ ఫోన్ ద్వారా భారత్ మీడియాకు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... పాక్ ప్రధాని షరీఫ్ పూర్వీకుల నివాసం భారత్ లోని అమృత్ సర్ సమీపంలోని జట్టీ ఉమారా ప్రాంతంలో ఉంది.