: రెండు గంటల్లో శ్రీవారి దర్శనం సాధ్యమేనా?
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో సాధారణ వేళల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు 10 గంటల సమయం పడుతోంది. ఇక, రద్దీ సమయాల్లో అయితే ఒక్కోసారి 24 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థిితి నెలకొంది. సాధారణంగా శ్రీవారి ఆలయానికి శుక్రవారం నుంచే భక్తుల రద్దీ పెరుగుతుంది. శని, ఆదివారాలు భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది. మంగళ, బుధ, గురువారాలు భక్తుల తాకిడి కాస్త తక్కువగా ఉంటుంది. సగటున శ్రీవారిని రోజూ 50 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనానికి 2 గంటలు కేటాయిస్తున్నారు. స్వామివారి నిత్య కైంకర్యానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక, సామాన్య భక్తుల దర్శనానికి మిగిలింది రోజులో 10 గంటలు మాత్రమే. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో తిరుమల సందడిగా మారుతుంది. అయితే, భక్తులకు త్వరగా దర్శనం అయ్యేందుకు టీటీడీ గతంలో అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అయినా, రోజురోజుకు పెరుగుతున్న భక్తులతో ఈ పథకాలు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం అయ్యేలా చూస్తామని ఇటీవల దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్యాలరావు చెప్పారు. అంతేకాదు, భక్తులకు 2 గంటల్లో శ్రీవారి దర్శనం అయ్యేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరి, నిజంగానే రెండు గంటల్లో శ్రీవారి దర్శనం అవుతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుమలేశుడి దర్శనం 2 గంటల్లో అవడం అసాధ్యమే. మరి, మంత్రిగారు చెప్పినట్లు రెండు గంటల్లో దర్శనమయ్యేందుకు ఏం చేస్తారో వేచి చూడాలి మరి!