: నేడు బ్రెజిల్ వెళుతున్న ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు బ్రెజిల్ వెళుతున్నారు. ఐదు దేశాల కూటమి 'బ్రిక్స్' (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ఆయన పయనమవుతున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు కోరడం, అభివృద్ధి బ్యాంకు ఏర్పాటును ఖరారు చేయడం తదితర అంశాలపై చర్చిస్తారు. ఈ రాత్రికి ఆయన బెర్లిన్ (జర్మనీ రాజధాని)లో విశ్రాంతి తీసుకుంటారు. రేపు బ్రెజిల్ ఈశాన్య తీర నగరం ఫోర్టాలెజాకు చేరుకుంటారు. ప్రధాని హోదాలో ఆయనకు ఇదే తొలి బహుళ పక్ష సదస్సు. ఈ సదస్సుకు మోడీ వెంట హై లెవెల్ బృందం వెళుతోంది. ఇందులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్, విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ ఉన్నారు.