: బ్రెజిల్ మళ్లీ ఓడింది... నెదర్లాండ్స్ కు మూడో స్థానం
ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన బ్రెజిల్ కు... ఈ కప్ చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. సొంత దేశంలో టోర్నీ జరుగుతున్నప్పటికీ బ్రెజిల్ కీలక దశలో చేతులెత్తేసింది. స్టార్ ప్లేయర్ నెయ్ మార్ జట్టుకు దూరం కావడంతో... బ్రెజిల్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో రాత్రి మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో బ్రెజిల్ పై 3-0 తేడాతో నెదర్లాండ్స్ జయకేతనం ఎగురవేసింది. తొలి అర్ధ భాగంలోనే నెదర్లాండ్స్ రెండు గోల్స్ సాధించి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇంజ్యురీ సమయంలో మరో గోల్ సాధించి విజయ బావుటా ఎగుర వేసింది. ఆట రెండో నిమిషంలోనే నెదర్లాండ్స్ కు పెనాల్టీ అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగపరుచుకున్న పెర్సీ గోల్ కొట్టాడు. అనంతరం ఆట 17వ నిమిషంలో బ్లిండ్ రెండో గోల్ కొట్టాడు. చివరి గోల్ ను ఇంజ్యురీ సమయంలో విజ్నాల్డమ్ కొట్టాడు. దీంతో, నెదర్లాండ్స్ 3-0 గోల్స్ తో విజయం సాధించింది. బ్రెజిల్ ఓటమితో ఆ దేశ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.