: దోసెలు తినాలని ఉందా? అయితే ‘దోసె ప్లేస్’కి వెళ్లాల్సిందే!
వేడి వేడి దోసెలు తినాలని ఉందా? అయితే, హైదరాబాదు, మాదాపూర్, అయ్యప్ప సొసైటీలోని ‘దోసె ప్లేస్’కి వెళ్లాల్సిందే. పెసరట్టు, మినపట్టు, ఉప్మా అట్టు వంటి సాంప్రదాయక రుచులే మనకు తెలుసు. కాలక్రమంలో అట్టు పేరు కాస్తా దోసెగా మారిపోయిన విషయం తెలిసిందే కదా. అక్కడ తీన్ మార్ దోసె, వెజ్ దోసె, పిజ్జా దోసె... వంటి రకరకాల దోసెలను రుచి చూడొచ్చు. అక్కడ మొత్తం 111 రకాల దోసె వెరైటీలు నోరూరిస్తున్నాయి. వీటి ధర రూ.30 మొదలుకొని రూ.150 వరకు ఉంది. ఈ దోసె రుచిని చూసి హైదరాబాదీలు ఫిదా అవుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులైతే సాయంకాలమైతే చాలు, దోసెలను తినేందుకు ఇక్కడ వాలిపోతున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఇక్కడకు వచ్చి దోసె రుచి చూశారంటే ఈ దోసెలకున్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ‘ఐస్ క్రీమ్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నవదీప్, తేజస్వి కూడా ఇక్కడకు వచ్చి దోసెల రుచి చూసి ‘అదిరింది గురూ’ అన్నారు. అజయ్ అనే ఔత్సాహికుడు ఈ దోసె ప్లేస్ ను ప్రారంభించాడు. అన్నట్లు, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరీ ఈ సంస్థను ఆరంభించాడు. ఇప్పుడు దోసె ప్లేస్ 200 మందికి ఉపాధిని కల్పిస్తోంది. భవిష్యత్తులో విజయవాడ, గుంటూరులకు ‘దోసె ప్లేస్’ను విస్తరించాలనుకుంటున్నట్లు అజయ్ చెప్పాడు. మరి, అజయ్ కి ఆల్ ది బెస్ట్ చెబుదామా!