: ఫైనల్ లో జర్మనీ, అర్జెంటీనా వ్యూహాలివే
ఫిఫా ప్రపంచకప్ అంతిమ సమరానికి జర్మనీ, అర్జెంటీనా జట్లు సిద్ధమయ్యాయి. ఫైనల్ కోసం అస్త్రశస్త్రాలతో ఇరు జట్లు సమాయత్తమయ్యాయి. జర్మనీ జట్టులో క్లోజ్, ముల్లర్, ఓజిల్, ల్హామ్, పొడోల్ స్కీ, ఎరిక్ డరమ్, షూష్టర్ వంటి స్టార్లు ఉండగా, అర్జెంటీనా జట్టు మెస్సీ, రొమెరోపై అధికంగా ఆధారపడుతోంది. జట్లన్నీ ప్రపంచకప్ కు సన్నద్ధమైన తీరు ఒకటి జర్మనీ సన్నద్ధమైన తీరు మరొక విధానం. అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఆక్సిజన్ తక్కువ ఉండే ప్రదేశాల్లో జర్మనీ ప్రపంచకప్ కోసం సన్నద్ధమైంది. అలాగే జట్టు మొత్తం స్టార్ ఆటగాళ్లు నిండి ఉండడానికి తోడు, వారి మధ్య సమన్వయం చక్కగా కుదరడంతో ప్రత్యర్థి జట్లను తేలిగ్గానే మట్టికరిపించింది. సెమీ ఫైనల్ లో జర్మనీ విజ్రుంభించి బ్రెజిల్ ను బోల్తాకొట్టించింది. అర్జెంటీనాను మట్టికరిపించేందుకు మెస్సీని టార్గెట్ చేసింది. ప్రపంచ కప్ మొత్తం జర్మనీ ఆటను పరిశీలిస్తే ఆటగాళ్లను మార్క్ చేసే విధానం అవలంభించారు. ఈ విధానంలో ప్రత్యర్థి ఆటగాడిని నిర్థేశించిన ఫార్వర్డ్ అడ్డుకుంటాడు. అతను విఫలమైతే ఢిఫెండర్లు అడ్డుకుంటారు. ఎవరి స్థానాల్లో వారే ఆడతారు. ఎటాక్ చేసే సందర్భంలో మాత్రం ఫార్వర్డ్ ప్లేయర్ స్థానాన్ని డిఫెండర్ ఆక్రమిస్తాడు. డిఫెండర్ స్థానాన్ని మిగిలిన డిఫెండర్లు భర్తీ చేస్తారు. గోల్ కీపర్ వరకు బంతి వెళ్లాలంటే కోటలాంటి డిఫెండర్లను దాటాల్సిందే. అప్పుడు కూడా కీపర్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. ఇక ఆర్జెంటీనా ఆటతీరు పరిశీలిస్తే, మెస్సీ, సెర్గియో ఆగ్వురో, ఏంజెల్ డీ మారియాలు ఆ జట్టుకు కీలకం. ఆ ముగ్గురే అటాకింగ్ భారాన్ని తలకెత్తుకుంటారు. మెస్సీని ప్రత్యర్థులు టార్గెట్ చేస్తే మారియా తన సత్తా చూపిస్తాడు. అతనికి ఫార్వర్డ్ లు చక్కని సహకారం అందిస్తారు. డిఫెండర్లే అర్జెంటీనా బలం. ప్రత్యర్థి ఆటగాడు దూసుకువస్తుంటే అతడ్ని అడ్డుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అర్జెంటీనా డిఫెండర్లు. ఇక గోల్ కీపర్ రొమొరో పెట్టని గోడలాంటి వాడు. రెండు జట్లకు డిఫెండర్లే కీలకం కానుండడంతో పోరు రసవత్తరంగా జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.