: ప్రతిష్ఠ కన్నా పైసలే ముఖ్యం! : ’గాంధీ‘ల నైజమిదేనా?
సోనియా గాంధీ... కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం పాటు అధ్యక్షురాలిగా కొనసాగుతున్న వ్యక్తి. అంతేనా, పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన యూపీఏ కూటమికి చైర్మన్. రాహుల్ గాంధీ ఆమె సుపుత్రుడు. కాంగ్రెస్ పార్టీ యువరాజు. ఈ కీర్తి వీరికి ఎక్కడి నుంచి సంక్రమించింది? నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ నుంచే కదా. మరి వారు సాధించి పెట్టిన ఘనతర ప్రతిష్ఠను ఎలా కాపాడాలి..!?'అబ్బబ్బే మాకెందుకా ప్రతిష్ఠ. మాకు మాత్రం పైసలే కావాలి, అంతే..!' ఇదీ ప్రస్తుతం సోనియా, రాహుల్ ల నైజం. నెహ్రూ మానస పుత్రిక, స్వతంత్ర సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆశయాల ప్రచారానికీ వెన్నుదన్నుగా నిలిచిన నేషనల్ హెరాల్డ్ పత్రిక దాదాపు మూతపడింది. అయితే ఆ పత్రికను తిరిగి ప్రారంభించే చర్యలను గాలికొదిలేసిన యువరాజు, దాని ఆస్తుల కైంకర్యంపై మాత్రం పట్టు చేజిక్కించుకున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఢిల్లీతో పాటు లక్నో, భోపాల్, ఇండోర్, ముంబై, పంచకుల (చంఢీఘడ్), పాట్నాలలో దాదాపు రూ. 5,000 కోట్ల విలువ చేసే స్థిరాస్తున్నాయి. వీటిని చేజిక్కించుకునేందుకు రాహుల్ పక్కా ప్రణాళిక రచించారు. పలుమార్లు మూతపడి, తిరిగి ప్రారంభమవుతూ వస్తున్న ఈ పత్రిక చివరి సారిగా 2008, ఏప్రిల్ 1న మూతపడింది. 2011లో దీనిని తెరిచే యత్నాలు జరిగినా, అవి కార్యరూపం దాల్చలేదు. అయితే అప్పటిదాకా ఈ పత్రికను నడిపిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) స్థానంలో 2010లో యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఆవిర్భవించింది. దీనిలోనూ ఏజేఎల్ పాలకవర్గంలోని రాహుల్, మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ లే సభ్యులుగా ఉండటం గమనార్హం. పత్రికను తిరిగి తెరిచేందుకే కొత్త సంస్థను ఏర్పాటు చేశామన్న ప్రకటన నీటి మూటే అయ్యంది. తాజాగా ఏజేఎల్ ఆస్తులను కైంకర్యం చేసేందుకే ఈ సంస్థ పుట్టుకొచ్చిందని ఆ తర్వాత జరిగిన పరిణామాలు తేటతెల్లం చేశాయి. 2008లో పత్రిక రూ. 90. 25 కోట్ల సంక్షోభంలో కూరుకుపోయింది. ఇందులో మెజార్టీ వాటా ఉద్యోగుల జీతభత్యాలే ఉన్నాయి. ఈ అప్పును తీర్చేందుకు యంగ్ ఇండియా హక్కు తీసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ ఓరా ఈ మొత్తాన్ని చెల్లించేశారు. ఈ క్రమంలోనే పత్రికకు చెందిన ఢిల్లీలోని భవంతితో పాటు ముద్రణ పరికరాలను అద్దెకు ఇచ్చారు. ఈ అద్దెను వసూలు చేస్తున్న ప్రైవేట్ సంస్థలో సోనియా, రాహుల్ లే కీలక భూమిక పోషిస్తున్నారు. తాజాగా ఏజేఎల్ కు ఇచ్చిన రుణాలను రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ, హెరాల్డ్ ఆస్తులను యంగ్ ఇండియాకు ఇచ్చేసింది. దీంతో హెరాల్డ్ ఆస్తులు రాహుల్ చేతికి దక్కినట్లే.