: శ్రీలంక ముందు భారీ టార్గెట్... సెంచరీలతో విరుచుకుపడ్డ సఫారీలు
సఫారీలు సెంచరీలతో విరుచుకుపడడంతో చివరి వన్డేలో శ్రీలంక ముందు భారీ స్కోరు నిలిచింది. శ్రీలంకలోని హంబన్ టోటలోని మహింద రాజపక్స మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో దక్షిణాఫ్రికా 339 పరుగుల భారీస్కోరు సాధించింది. సఫారీ జట్టులో క్వింటన్ డికాక్ (128; 12 ఫోర్లు, 3 సిక్సులు), కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ (108; 11 ఫోర్లు, 4 సిక్సులు) లంక బౌలింగ్ దాడులను తుత్తునియలు చేశారు. ఓపెనర్ ఆమ్లా 48 పరుగులు చేసి హెరాత్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఓపెనర్లుగా బరిలో దిగిన డికాక్, ఆమ్లా తొలి వికెట్ కు 118 పరుగులు చేశారు. లంక బౌలర్లలో మలింగ దారుణమైన గణాంకాలు నమోదు చేశాడు. మొత్తం పది ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ యార్కర్ స్పెషలిస్ట్ ఒక్క వికెట్టూ తీసుకోలేకపోగా, 85 పరుగులు సమర్పించుకున్నాడు. లంక బౌలర్లలో హెరాత్, మెండిస్ చెరో రెండు వికెట్లు తీశారు. మూడు వన్డేల సిరీస్ లో ఇరు జట్లు చెరో వన్డే నెగ్గి సమవుజ్జీలుగా ఉన్నాయి.