: పోలవరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమస్యే కాదు: వెంకయ్యనాయుడు
పోలవరం ఆర్డినెన్స్ లోక్ సభ ఆమోదం పొందడంపై తెలంగాణలో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమస్యే కాదన్నారు. ప్రస్తుతం అందరూ గిరిజనులకు పునరావాసం గురించే ఆలోచించాలని చెప్పారు. ముంపు బాధితులకు పునరావాసం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని పేర్కొన్నారు. కాగా, పోలవరం బిల్లుపై లోక్ సభలో మాట్లాడేందుకు స్పీకర్ రెండు గంటల సమయం ఇచ్చారన్న ఆయన, కొందరి సభ్యుల వైఖరి దురదృష్టకరంగా ఉండటంతో చర్చ జరగలేదన్నారు. బిల్లుపై లోతుగా చర్చ జరిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను వారే వ్యతిరేకించడం శోచనీయమన్నారు. పోలవరం ఆర్డినెన్స్ ను యూపీఏ ఇచ్చిన హామీ మేరకే తీసుకొచ్చామని గుర్తు చేశారు. జూన్ 2కు ముందే ఆర్డినెన్స్ వచ్చిందన్న విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని వెంకయ్య సూచించారు.