: తల్లిపై కక్షతో... కొడుకుపై దాడి
చైన్ స్నాచింగ్ చేసేందుకు యత్నించిన తమను పోలీసులకు పట్టిచ్చిన ఓ మహిళపై సదరు దుండగులు పగబట్టారు. కొంతకాలం పాటు కక్ష తీర్చుకునేందుకు వేచి చూశారు. అయితే ఆ మహిళ వారి కంటబడలేదో, కనబడ్డా దాడి చేేసేందుకు అవకాశం చిక్కలేదో కాని... 'నీవు దొరక్కపోతే, నీ కొడుకున్నాడుగా' అన్నట్లు ఆ చైన్ స్నాచర్లు ఆమె కొడుకుపై దాడి చేసి కాల్పులకు దిగారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో జిమ్ లో ఇన్ స్ట్రక్టర్ గా పనిచేస్తున్న ఆ మహిళ కొడుకు ప్రాణాపాయాన్ని తప్పించుకున్నా, తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే... కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న లైమాయుమ్ ఖుల్నా సాహ్ని, కొంత కాలం క్రితం తన ఆభరణాలను దోచుకునేందుకు వచ్చిన ఇద్దరు చైన్ స్నాచర్లను అడ్డుకోవడమే కాక అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి వారిని పోలీసులకు పట్టించింది. దీనిని మనసులో పెట్టుకున్న దుండగులు, శుక్రవారం ఉదయం బైక్ పై వెళుతున్న సాహ్ని కొడుకు రిక్కీ రంజిత్ సాహ్నిని వెంబడించి, రెండు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. అయితే తొలి బుల్లెట్ గురి తప్పగా, రెండో బుల్లెట్ మాత్రం రిక్కీ కాలులోకి దూసుకుపోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.