: రెండు రాష్ట్రాలకూ కేంద్రం అన్యాయం చేస్తోంది: కోదండరాం
తెలంగాణకే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేంద్రం అన్యాయం చేస్తోందని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం అన్నారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా శనివారం తెలంగాణలో జరుగుతున్న బంద్ లో భాగంగా ఆయన హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఆదివాసులను ముంచి ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సాగు, తాగు నీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలున్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపడం అన్యాయం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు రూ. 20 వేల కోట్ల మేర లబ్ధి చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రాజెక్టులో భాగంగా ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఏపీలో కలిపితే సరిపోతుందన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.