: తెలంగాణ రాజముద్రలో లోపాలున్నాయి... హైకోర్టులో పిల్
తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో లోపాలున్నాయా? అవుననే అంటున్నారు టి. ధనగోపాల్. కేవలం అనడమే కాదు, లోపభూయిష్టమైన రాజముద్రను సవాల్ చేస్తూ హైకోర్టుకెక్కారు. ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రాజముద్రలో మూడు సింహాల కింద దేవనాగరి లిపిలో 'సత్యమేవ జయతే' అనే పదాలు ఉండాలి. అయితే మూడు సింహాలు ఎంబ్లం పైభాగాన ఉంటే సత్యమేవ జయతే కిందిభాగాన ఉంది. ఇది 'స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా చట్టం'లోని నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషన్ లో ధనగోపాల్ పేర్కొన్నారు. లోపాన్ని సరిదిద్దకుండానే తెలంగాణ ప్రభుత్వం రాజముద్రకు ఆమోదం వేసిందని... వెంటనే రాజముద్రలోని లోపాలను సరిదిద్దేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాజముద్ర రూపకర్త ఏలే లక్ష్మణ్ లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.