: బ్రెజిల్ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు
ఫిఫా ప్రపంచ కప్ లో తమ జట్టు ఓటమిని బ్రెజిల్ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆతిథ్య జట్టుగా, టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన బ్రెజిల్ జట్టు స్టార్ స్ట్రైకర్ నేయ్ మార్, మరో స్టార్ సిల్వా గౌర్హాజరీలో జర్మనీతో జరిగిన సెమీఫైనల్ లో 7-1 తేడాతో ఘోరపరాజయం పాలైంది. ఇది జరిగి మూడు రోజులు గడిచినా అభిమానులు తమ జట్టు పరాజయాన్ని మర్చిపోలేకపోతున్నారు. దీంతో రేపు తెల్లవారుజామున మూడో స్థానం కోసం జరుగుతున్న మ్యాచ్ కు ఆదరణ కరవైంది. మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు బ్రెజిల్ అభిమానులు అంత ఆసక్తి చూపడం లేదని మీడియా కథనాలు ప్రచురించింది. అభిమానుల ఆదరణ లేకపోవడంతో స్టేడియంలో సీట్లు మిగిలిపోనున్నాయని బ్రెజిల్ మీడియా పేర్కొంది.