: పారిశ్రామిక రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పారిశ్రామిక రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇంతకు ముందు విద్యుత్ రంగం, ఆర్థిక రంగంపై శ్వేతపత్రాలను విడుదల చేసిన బాబు ఇప్పుడు తాజాగా మూడో శ్వేతపత్రాన్ని ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి ఆయన మాట్లాడుతూ... యూపీఏ, కాంగ్రెస్ పాలనలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. అసమర్థ, అవినీతి, కుంభకోణాల కాంగ్రెస్ వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిందన్నారు. చిన్న పరిశ్రమలతో పాటు కొన్ని పెద్ద కంపెనీలు కూడా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. 2009 నుంచి రాష్ట్రంలో అవినీతి, కుంభకోణాలేనని ఆయన అన్నారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రంలో ఉద్యమాలు నడిచాయని ఆయన చెప్పారు. ఏపీకి రావాల్సిన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని అన్నారు. గత పదేళ్ల పరిణామాల వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలకు కావలసిన సదుపాయాలను కల్పించలేకపోయిందన్నారు. గ్యాస్, పవర్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలు పెరగకపోగా, ఉన్నవి మూతబడ్డాయని ముఖ్యమంత్రి చెప్పారు. సెజ్ ల పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొన్నారని ఆయన అన్నారు. ప్రతి చోటా క్విడ్ ప్రోకో రాజ్యమేలిందన్నారు. లేపాక్షి హబ్ కోసం ఇష్టానుసారం భూములు కేటాయించారని, బ్రహ్మణి స్టీల్స్ కోసం 10,760 ఎకరాలు ఇచ్చేశారని ఆయన చెప్పారు. వాన్ పిక్ కు 19 వేల ఎకరాలు దోచిపెట్టారన్నారు. ప్రజా ప్రయోజనాలను పక్కన బెట్టి ఎక్కడ భూములున్నా దోచుకున్నారని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News