: లాహోర్ హైకోర్టు ప్రాంగణంలో హఫీజ్ సయీద్ ప్రసంగం
లష్కరే- తోయిబా వ్యవస్థాపకుడు, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ లాహోర్ హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓ సెమినార్ లో ప్రసంగించాడు. భారత్ తో పాటు అగ్రరాజ్యం అమెరికా పైనా తనదైన రీతిలో విషం చిమ్మాడు. ఇటీవలే జమాత్ ఉద్ దవాను అమెరికా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అయినా పాకిస్తాన్ లో బహిరంగంగానే సంచరిస్తున్న సయీద్, శుక్రవారం పాకిస్తాన్ జస్టిస్ పార్టీ నిర్వహించిన సెమినార్ కు హాజరై, న్యాయవాదులు, ప్రజలను ఉద్దేశించి ఉద్రేకపూరితంగా ప్రసంగించాడు. ఈ ఏడాదిలో సయీద్ బహిరంగ ప్రసంగాలివ్వడం ఇది తొలిసారేమీ కాదు. ఆ దేశ బార్ అసోసియేషన్లలో పేరుగాంచిన లాహోర్ బార్ అసోసియేషన్ మే నెలలో నిర్వహించిన సెమినార్ కు ఏకంగా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే, సయీద్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని లాహోర్ బార్ అసోసియేషన్ లోని ఓ వర్గం తప్పుబట్టింది.