: కాశ్మీర్ పండిట్ల మీద మోడీ అపార ప్రేమ
కాశ్మీర్ పండిట్ల పునరావాసానికి మోడీ సర్కార్ నడుం బిగించింది. కాశ్మీర్ పండిట్లను మళ్లీ వారి సొంత ప్రాంతానికి రప్పించేందుకు బడ్జెట్ లో అంచనాకు అందని రీతిలో రూ.500 కోట్లను కేటాయించింది. అధికారంలోకి రాగానే కాశ్మీర్ పండిట్లు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని మోడీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ ఆ దిశగా తొలి అడుగు వేశారు. 1990లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం తారస్థాయికి చేరింది. ఈ సమయంలోనే వేలాది మంది కాశ్మీర్ పండిట్లు ఉగ్రవాదుల చేతిలో ఊచకోతకు గురయ్యారు. ఉగ్రవాదుల అకృత్యాలు తట్టుకోలేక దాదాపు 40 వేల కుటుంబాలు కాశ్మీర్ లోయను ఖాళీ చేశాయి. దాదాపు 9 లక్షల మంది కాశ్మీర్ పండిట్లు దేశంలోని వివిధ నగరాలకు తరలి వెళ్లారు. సొంతదేశంలోనే శరణార్థుల్లా బతుకుతూ పాతికేళ్లగా ఘోరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు కాశ్మీర్ పండిట్లు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, వేర్పాటువాదుల అరాచకాలతో పాటు ఆ సమయంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సర్కార్ మెతక వైఖరి కాశ్మీర్ పండిట్ల దుస్థితికి ప్రధాన కారణం. తాజాగా మోడీ రాకతో కాశ్మీర్ పండిట్లు తమ సొంత ప్రాంతానికి వెళ్లేందుకు ఉద్యుక్తులవుతున్నారు. కాశ్మీర్ లోయకు తిరిగి వచ్చే పండిట్లకు భారీ నజరానాను ప్రకటించడంతో పాటు వారికి కావాల్సిన రక్షణను కూడా అందించేందుకు మోడీ సర్కార్ సిద్ధమైంది. గంగా ప్రక్షాళనతో పాటు కాశ్మీర్ పండిట్లను తమ స్వస్థలాలకు చేర్చి... లోయలో శాంతిని నెలకొల్పడాన్ని కూడా మోడీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.