: ముంబైలో భారీ వర్షం... స్తంభించిన జన జీవనం
దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరాన్ని వర్షం ముంచెత్తింది. వరుసగా రెండో రోజైన శుక్రవారం కూడా నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో, నగరంలోని చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. భారీవర్షం కారణంగా నగరంలోని పలు రహదారుల్లో మోకాలి లోతులో వర్షపు నీరు పొంగిపొరలుతోంది. నగరంలోని అంధేరీ, కొలాబా, కుర్లా, శాంతాక్రజ్ తదితర ప్రాంతాల్లో భారీస్థాయిలో నీరు నిలిచిపోయింది. దాదర్, పారెల్, సియాన్, కుర్లా, గట్కోపార్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన వర్షపు నీరు ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించింది. రోడ్లపై నిలిచిన నీటిని తోడేసేందుకు మునిసిపల్ కార్పోరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) అధికారులు శతధా యత్నిస్తున్నారు. దాదాపు 130 పంపుసెట్లతో రోడ్లపై నిలిచిన నీటిని తోడేందుకు యత్నిస్తున్నట్లు ఎంసీజీఎం అధికారి తెలిపారు.