: మోడీకి ఒబామా ఆహ్వానం... మారుతున్న సమీకరణాలు


కొన్నాళ్ళ వరకు నరేంద్ర మోడీ అంటే తీవ్ర వ్యతిరేకత కనబర్చిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళూ వీసా నిరాకరిస్తూ మోడీని తమదేశంలో అడుగుపెట్టనీయని అమెరికా సర్కారు ఇప్పుడు ప్రధాని హోదాలో ఆయనకు రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా... భారత ప్రధానమంత్రి మోడీకి అధికారిక ఆహ్వానం పంపారు. సెప్టెంబర్ లో తమ దేశంలో పర్యటించాల్సిందిగా కోరారు. ఈ విషయాన్ని నేడు మోడీని కలిసిన అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి విలియం బర్న్స్ తెలిపారు. ఇంతక్రితమే అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఎన్నికల ఫలితాల అనంతరం మోడీని ఆహ్వానించారు. అయితే అది అధికారిక ఆహ్వానం కాకపోవడంతో దానికి పెద్దగా ప్రాముఖ్యత లభించలేదు. కాగా, మోడీ తన అమెరికా పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News