: కసితో రగిలిపోతున్న నేమార్... మెస్సీతో ఏం చెప్పాడంటే..!
బ్రెజిల్ ఓ క్లబ్ స్థాయి జట్టుకంటే దారుణంగా ఓటమిపాలవడం పట్ల సూపర్ ఫార్వర్డ్ నేమార్ రగిలిపోతున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ లో జర్మనీ చేతిలో 1-7 తేడాతో బ్రెజిల్ ఓడడాన్ని నేమార్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అదీ సొంతగడ్డపై ఓడడం అవమానకరంగా భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మిత్రుడు, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లయొనెల్ మెస్సీకి ఓ సందేశం పంపాడు. ఫైనల్లో జర్మనీని చిత్తుగా ఓడించాలని సూచించాడు. టెరెసోపోలిస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నేమార్ కన్నీటిపర్యంతమయ్యాడు. వెన్నెముక గాయం కారణంగా సెమీస్ కు దూరమవడం బాధాకరమని వ్యాఖ్యానించాడు. అనంతరం మాట్లాడుతూ, ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మెస్సీకి శుభాకాంక్షలు తెలియజేశాడు. మెస్సీ క్రీడాచరిత్ర అద్భుతమని, మెరుగైన ప్రదర్శనతో ఎన్నో ట్రోఫీలు గెలిచాడని గుర్తు చేశాడు. నేమార్, మెస్సీ... స్పానిష్ లీగ్ లో బార్సిలోనా క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక, క్వార్టర్ ఫైనల్లో తన గాయానికి కారణమైన కొలంబియా డిఫెండర్ జునిగాను క్షమించానని తెలిపాడు. ఆ మ్యాచ్ మరుసటి రోజే జునిగా ఫోన్ చేసి క్షమాపణ కోరాడని నేమార్ వెల్లడించాడు.