: తణుకు ఎమ్మెల్యే సరికొత్త ’దర్శనం‘
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన నియోజకవర్గంలో సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోని సమస్యలను తెలుసుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో కలసి గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయంచారు. ’గ్రామ దర్శనం‘గా పేరు పెట్టకున్న ఈ యాత్రను ఆయన అనుకున్నదే తడవుగా శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని అత్తిలి మండలం కంచుమర్రు గ్రామంలో ప్రారంభించారు. గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించిన ఆయన సమస్యలపై ప్రజలతో ముచ్చటించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల వద్దకెళ్లి నానా ఇబ్బందులు పడకుండా తమ ఎమ్మెల్యే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.