: మహారాష్ట్ర సీఎంగా కొనసాగనున్న పృథ్వీరాజ్ చవాన్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మారుస్తారంటూ వస్తున్న ఊహాగానాలకు కాంగ్రెస్ తెరదించింది. ప్రస్తుతమున్న పృథ్వీరాజ్ చవాన్ నే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జ్ మోహన్ ప్రకాష్ మాట్లాడుతూ, సీఎం పదవిలో ఎలాంటి మార్పు లేదని, పృథ్వీరాజ్ నే ఉంచాలనుకుంటున్నట్లు మీడియాకు తెలిపారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఇక్కడి 48 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ రెండు చోట్ల గెలవగా, యూపీఏ కూటమి పార్టీ ఎన్సీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. దాంతో, గుర్రుగా ఉన్న అధిష్ఠానం మహారాష్ట్ర నాయకత్వాన్ని మార్చనున్నట్లు కొన్నిరోజుల కిందట వార్తలు వచ్చాయి. త్వరలో ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ భావించింది.