: ఆ ఇద్దరు ఇరగదీశారు... భారత్ తొలి ఇన్నింగ్స్ 457


నాటింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ అదరగొట్టింది. 457 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచింది. టెయిలెండర్లు భువనేశ్వర్ 58 (149 బంతులు, 5 ఫోర్లు), షమీ 51* (81 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ చివర్లో హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. వీరిని ఔట్ చేయడానికి ఇంగ్లీష్ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. అంతకు ముందు మురళీ విజయ్ 146 పరుగులు (361 బంతులు, 25 ఫోర్లు, 1 సిక్స్)తో విదేశాల్లో తన రికార్డును మెరుగుపరుచుకున్నాడు. ధోనీ 82 (152 బంతులు, 7 ఫోర్లు) పరుగులతో మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ దిశగా కొనసాగుతున్న తరుణంలో సింగిల్ తీసేందుకు యత్నించిన ధోనీని... అండర్సన్ మిడాఫ్ నుంచి మెరుపు వేగంతో బంతి విసిరి రనౌట్ చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం వికెట్లు టపటపా రాలిపోయాలి. జడేజా (25), బిన్నీ (1), ఇషాంత్ (1) వెనుదిరిగారు. ఇక భారత్ ఇన్నింగ్స్ ముగిసిపోయిందనుకున్న తరుణంలో భువనేశ్వర్, షమీలు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని... చివరి వికెట్ కు ఏకంగా 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న కెప్టెన్ కుక్ కేవలం ఐదు పరుగులకే పెవిలియన్ చేరాడు. మొహమ్మద్ షమీ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో రోజు ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. రాబ్సన్ (20), బాలెన్స్ (15) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

  • Loading...

More Telugu News