: సౌదీ అరేబియాలో భారతీయ పనిమనుషులకు శుభవార్త
సౌదీ అరేబియాలో భారత పనిమనుషుల ఉద్యోగాల కోసం వెళ్లేవారికి ఊరట లభించనుంది. కార్మిక చట్టాలు లేకపోవడంతో భారతదేశం నుంచి పనికోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే పనిమనుషులు శారీరక, మానసిక, లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దీనికి చెక్ చెప్పేందుకు భారత విదేశాంగ శాఖ నడుం బిగించింది. అందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కొత్త ఉద్యోగ ఒప్పందం ప్రకారం, భారత్ నుంచి సౌదీ వెళ్లే పనిమనుషుల కోసం సౌదీ అరేబియా నియామక వీసాలు జారీ చేస్తోంది. కార్మికుల అంశాలకు సంబంధించి ఏర్పాటైన సౌదీ-భారత్ జాయింట్ కమిటీ నియామక ఒప్పందాన్ని ఖరారు చేసిందని సౌదీ కార్మిక శాఖ సహాయ మంత్రి ముఫరీజ్ ఆల్-హుక్‌బనీ తెలిపారు. నియామక వ్యయం, ఉద్యోగ ఒప్పందం ప్రామాణికత, అమలు, చట్టాలను ఉల్లంఘించే నియామక ఏజెన్సీలపై తీసుకోవాల్సిన చర్యలు, మధ్యవర్తుల మోసాలను అరికట్టడం మొదలైన అంశాలను ఈ కమిటీ పరిశీలించిందని ఆయన వెల్లడించారు. సౌదీ అరేబియాతో భారత ప్రభుత్వం కార్మిక సహకారానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. దీంతో సౌదిలో ఇంటి పనివారి కొరత, భారత్ లోని నిరక్షరాస్య కార్మికులకు ఉద్యోగ సమస్య ఏకకాలంలో పరిష్కారం కానున్నాయి. కాగా, ఈ ఒప్పంద కాల పరిమింతి ఐదేళ్లు కాగా, దీని ద్వారా భారతీయ కార్మికులకు కనీస వేతనం, కనీస పని గంటలు, వేతనంతో కూడిన సెలవు, భద్రత లభించనున్నాయి.