: అంచనాలు అందుకోని టీమిండియా... స్కోర్ 353/9!
టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, ఓపెనర్ మురళీ విజయ్ కి కెప్టెన్ కూల్ ధోని సహకరించడంతో ఓ మోస్తరు స్కోరు సాధించింది. తొలి రోజు నాలుగు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసిన టీమిండియా రెండో రోజు ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. తొలి రోజు స్కోరుకు మరో 24 పరుగులు జత చేసిన మురళీ విజయ్ 146 పరుగుల వద్ద అవుటయ్యాడు. అర్ధసెంచరీ చేసిన ధోనీ (82) కాసేపు ప్రతిఘటించినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది. డ్రింక్స్ విరామం వరకు జాగ్రత్తగా ఆడిన ధోనీ, జడేజా (25)తో కలిసి నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ రన్ ఔట్ గా వెనుదిరగడంతో టీమిండియా టెయిలెండర్లు పెద్ద ప్రతిఘటన లేకుండానే చేతులెత్తేశారు. ఈ టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన స్టూవర్ట్ బిన్నీ ప్రాక్టీస్ మ్యాచ్ లో రాణించినప్పటికీ కేవలం ఒక్క పరుగు మాత్రమే జత చేయగలిగాడు. దీంతో టీమిండియా 353 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. క్రీజులో భువనేశ్వర్ కుమార్ (8), మహ్మద్ సమీ (1) ఉన్నారు.