: బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది: చంద్రబాబు
వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి 2.50 లక్షలకు పెంచడం మంచిదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాదులోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని అన్నారు. ఐఐటీ, ఐఐఎంల ఏర్పాటు విజ్ఞాన సమాజంలో ముందడుగు అని ఆయన అభివర్ణించారు. బీజేపీ ప్రభుత్వం తొలి నెలలో చేసింది బాగుంది, ఇంకా చేయాల్సింది ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోణంలో బడ్జెట్ ను ప్రజల ముందుకు తీసుకువచ్చారని చంద్రబాబు చెప్పారు. కాకినాడ హార్డ్ వేర్ పార్క్ ఏర్పాటు నిరుద్యోగ సమస్యను తొలగించడానికి దోహదపడుతుందన్నారు. బడ్జెట్ పై సంతృప్తికరంగా ఉన్నామని ఆయన అన్నారు. దెబ్బతిన్న దేశ ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని చంద్రబాబు కోరారు. ఇక నుంచి వారంలో రెండు రోజులు జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఆయన చెప్పారు. రెండు అంశాల పైన తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తానని ఆయన అన్నారు.