: పవన్ కల్యాణ్ జనసేన హెచ్చరిక
సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన 'జనసేన' పార్టీ ప్రకటన విడుదల చేసింది. సోషల్ నెట్ వర్క్ లో 'జనసేన' పార్టీ పేరిట, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పార్టీ పేరుతో కానీ, పార్టీ అధ్యక్షుడి పేరిట కానీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం విరాళాలు వసూలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలా విరాళాలు సేకరించే వారు ఎవరైనా అభిమానులు, కార్యకర్తల దృష్టికి వస్తే తెలియజేయాలని పార్టీ ప్రకటనలో పేర్కొన్నారు. 'జనసేన' పార్టీకి ఎన్నికల సంఘం నుంచి పూర్తి స్థాయి గుర్తింపు వచ్చిన తరువాత పార్టీ భవిష్యత్ ప్రణాళిక స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈమధ్య కాలంలో పవన్ కల్యాణ్ ఫోటో పెట్టి, 'ప్రశ్నించడానికి వస్తానని ఘనంగా ప్రకటించిన పవన్ కల్యాణ్ ధరలు పెరుగుతున్నా ప్రశ్నించడానికి రాలే'దేంటంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన 'జనసేన' పార్టీ ఈ ప్రకటన విడుదల చేసింది.