: మీడియా ముందుకు 'సానియా' నిందితులు
సానియా మర్డర్ మిస్టరీ వీడింది. ప్రేమ వ్యవహారంలో ఆమె సన్నిహితులే సానియాను చంపేశారని పోలీసులు తెలిపారు. ఆమెను హతమార్చిన జీషన్, హుస్నాఖాన్ అనే వ్యక్తులతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు ఈ సాయంత్రం మీడియా ఎదుట హాజరుపరిచారు. హత్యా వివరాల గురించి చెబుతూ, సహోద్యోగులే ఆమెను హతమార్చారని డీసీపీ చెప్పారు. సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా కేసును ఛేదించామని పోలీసులు తెలిపారు.
జీషన్, హుస్నా ఖాన్.. సానియా పనిచేసే ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలోనే ఉద్యోగులని చెప్పారు. జీషన్ తో సానియా సన్నిహితంగా ఉండడం సహించలేని మరో ఉద్యోగిని హుస్నా లో ఈర్ష్య అంకురించడంతోనే ఈ హత్య జరిగిందని డీసీపీ తెలిపారు. హుస్నా ఈ హత్య కోసం మరో ఇద్దరితో ఒప్పందం కుదుర్చకుందని ఆయన తెలిపారు. వీరందరూ రెండ్రోజుల క్రితం సానియా ఇంటికి వెళ్ళి ఈవెంట్ ఉందంటూ పిలుచుకుని వెళ్ళారని.. మెహదీపట్నంలోని ఓ హోటల్ లో భోజనం చేసిన అనంతరం నగరం వెలుపలికి వెళ్ళిన వీరు సానియాను అక్కడ ఊపిరాడకుండా చేసి చంపేశారని వెల్లడించారు.
అనంతరం కారులో ఆమె శవాన్ని తీసుకుని వెళ్ళి గండిపేటలో దహనం చేయబోతుండగా పోలీసుల రాకతో పరారయ్యారని తెలిపారు. కాగా, ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లో నిందితులను అదుపులోకి తీసుకోవడం విశేషం.