: ఏపీకి 24 గంటల విద్యుత్ సరఫరా: పల్లె రఘునాథరెడ్డి
ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. ఇళ్లు, పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. రైతులకు 7 నుంచి 9 గంటలు నిరంతరాయంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి నిరాటంక, నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. మంత్రివర్గ భేటీ ముగిసిన అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్ధల నుంచి విద్యుత్ తీసుకుని ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తామన్నారు. విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇక వ్యవసాయంలో సంస్కరణలు ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి, రైతులకు ఉచితంగా పంపుసెట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పాతవాటి స్థానంలో కొత్తగా 13 లక్షల 50వేల పంపుసెట్లు ఇస్తామన్నారు. వ్యవసాయంలో అధిక రాబడి సాధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందని వివరించారు. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే 24 గంటల్లో మరమ్మతులు చేయిస్తామన్నారు. విద్యుత్ సంస్థల్లో నష్టాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పారు.