: బాధ చెప్పకుందామనొస్తే... తిట్లు తినాల్సొచ్చింది
వారంతా వికలాంగులు. ప్రభుత్వం ఏదోరీతిన సాయం చేస్తే బతుకెళ్లదీస్తామనే యోచనలో ఉన్నవాళ్ళు. 'అనుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి తాముంటున్న ప్రాంత సమీపంలోకే వస్తున్నారు కదా, ఎలాగోలా కలిసి తమ బాధలు చెప్పేసుకోవచ్చు... ఎంతైనా మన సీఎం మహిళ కదా, కాస్త దయచూపుతారులే' అనే భరోసాతో పశ్చిమ బెంగాల్ లోని బర్ద్వాన్ జిల్లాకు చెందిన రెండు వేల మంది వికలాంగులు జిల్లాలోని ఝిన్ గుటికి వ్యయప్రయాసలకోర్చి తరలివెళ్లారు. తీరా అక్కడికొచ్చిన తర్వాత సీఎం మమతా బెనర్జీ వారిని కలిసేందుకు ఇష్టపడలేదు. దీంతో ఎలాగైనా ఆమెకు తమ బాధలు చెప్పుకోవాల్సిందేనన్న కృత నిశ్చయంతో వికలాంగులు ధర్నాకు దిగేందుకు ఉపక్రమించారు. అంతే, ఆగ్రహం కట్టలు తెంచుకున్న దీదీ ఒంటికాలిపై లేచారు. "మీరంతా కాంతి గంగూలి ముఠా వాళ్లని నాకు బాగా తెలుసు" అంటూ వికలాంగులపైకి గుర్రుగా చూశారు. తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా దీదీ కరుణించిన పాపాన పోలేదు. దీదీ సీఎం పీఠంపై ఉండడంతో ఆమె ముందు తమ వాదన వీగిపోతుందని తెలుసుకున్న వికలాంగులు గుండెల నిండా బాధతో వెనుదిరగక తప్పలేదు. కాంతి గంగూలీ ఎవరంటే, వామపక్ష పార్టీ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ నేత. అసలే వామపక్షాలంటే దీదీ కి గిట్టవుగా మరి!