: జీహెచ్ఎంసీ కార్మికులకు కమిషనర్ అల్టిమేటం
జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల నేతలతో కమిషనర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాల సవరణ, బకాయిల చెల్లింపుపై ప్రభుత్వంతో చర్చిస్తానని కమిషనర్ సోమేష్ కుమార్ చెప్పినప్పటికీ కార్మిక సంఘాలు శాంతించలేదు. తక్షణమే వేతన సవరణ చేయాలని, బకాయిలు చెల్లిస్తే కానీ విధుల్లోకి వచ్చేది లేదని వారు కమిషనర్ కి స్పష్టం చేశారు. దీంతో కమిషనర్ మరోసారి కార్మికులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. వచ్చేది బోనాలు, రంజాన్ సీజన్, వర్షాకాలం అని... పారిశుద్ధ్య కార్మికులు విధుల్లోకి రావాలని సోమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వారు స్పందించకపోవడంతో, కాంట్రాక్టు కార్మికుల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. వారిని అడ్డుకుంటే ఎస్మా ప్రయోగించాల్సి వస్తుందని సోమేష్ కుమార్ హెచ్చరించారు. నగర ప్రజల పరిశుభ్రత తమకు ముఖ్యమని అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కార్మిక సంఘాల సమస్య పరిష్కరిస్తామని చెప్పినా వారు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.