: వీళ్ళకు పార్లమెంటులోనే నిద్రొస్తుంది!
పార్లమెంటు... దేశ అత్యున్నత నిర్ణయాలు చట్టంగా మారేది అక్కడే. ఓ ప్రతిపాదన, ఓ వ్యతిరేకత... చర్చలు, ప్రశ్నోత్తరాలు... బిల్లులు, ఆమోదముద్రలు... ఇన్ని కార్యకలాపాలకు వేదిక అది. అక్కడికొచ్చే ప్రజాప్రతినిధుల ప్రధానవిధి... తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలకు సభాముఖంగా పరిష్కారం కనుగొనడమే. కానీ, కొందరు సభ్యుల నడవడిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉంటోంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభలో కునుకుతీయడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లోక్ సభలో ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న పార్టీకి చెందిన అగ్రనేత అలా అన్నీ గాలికొదిలేసి హాయిగా నిద్రపోవడం విస్తుగొలుపుతోంది. అయితే, రాహుల్ ఒక్కడే కాదు, ఇంతకుమునుపూ కొందరు నేతలు పార్లమెంటులో నిద్రాదేవిని ఆహ్వానించినవాళ్ళే. పదేళ్ళు పాలించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం సభలో నిద్రపోయారు. మాజీ ఎంపీ, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నూ ఈ జాబితాలో చేర్చాలి. ఇక, ఛలోక్తులతో కూడిన ప్రసంగాలకు పెట్టింది పేరైన లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఎవరైనా సుదీర్ఘ ప్రసంగాలకు దిగితే ఓ కునుకేస్తారు. 2011లో పార్లమెంటు సమావేశాల్లో ఆయన ఇలాగే బుక్కయిపోయారు. ముందు వరుసలో స్పీకర్ ఎదురుగానే కూర్చుని లాలూ నిద్రపోవడం అప్పట్లో అందరి నోళ్ళలో నానింది. ఇక, కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, రాజీవ్ శుక్లా, వీరప్ప మొయిలీల స్టయిలే వేరు. వీళ్ళు చక్కగా మేనేజ్ చేస్తారు. కళ్ళు నులుముకుంటూ, ఆవలిస్తూ... ఎక్కడా దొరక్కుండా బండిలాగిస్తారు. కొన్ని వారాల క్రితం ఎంపీ సంతోష్ గంగ్వార్ అయితే సాక్షాత్తూ ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగానే నిద్రపోవడం మరీ దారుణం. వీరందరిదీ ఒకెత్తయితే మాజీ ప్రధాని దేవెగౌడది మరో ఎత్తు! ఈయన ప్రధానమంత్రిగా వ్యవహరించిన కాలంలోనూ పార్లమెంటులో నిద్రపోతూ దర్శనమిస్తుండేవారు. దేవెగౌడ నిద్ర వ్యవహారం ఎంత ప్రసిద్ధికెక్కిందంటే... ఈయన నిద్రాభంగిమలతో ఏకంగా పోస్టర్లే వెలిశాయి.