: సమూల ప్రక్షాళన దిశగా ఉపాధి హామీ?
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రూపు రేఖలు సమూలంగా మారనున్నాయి. ప్రతి కుటుంబానికి ఏడాదిలో వంద పని దినాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన ఈ పథకం దేశ వ్యాప్తంగా అమలైంది. నిధులైతే భారీగానే ఖర్చయ్యాయి కానీ, అంతే స్థాయిలో పనులను మాత్రం చేపట్టలేదన్న అపవాదు ఈ పథకం మూటగట్టకుంది. అంతేకాక పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు ఈ పథకం కేంద్రంగా నిలిచిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కేంద్ర బడ్జెట్ కు ఒక రోజు ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకంపై విమర్శనాస్త్రాలు సంధించారు. భారీ స్థాయి నిధులతో చేపట్టిన ఈ పథకం దేశానికి ఏం ఒరగబెట్టిందని ఆయన బుధవారం వ్యాఖ్యానించారు. అంతేకాక పేదలకు ఉపాధి భరో్సా కల్పిస్తూనే దేశ సంపదను పెంచేలా ఈ పథకాన్ని సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీకి సరికొత్త రూపు కల్పించే కసరత్తు దాదాపు మొదలైందనే చెప్పాలి.