: 60 శాతం మార్కుల నిబంధన విద్యా రుణాలకు చెల్లదు: మద్రాసు హైకోర్టు
విద్య కోసం రుణం పొందేందుకు విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లో 60 శాతం మార్కులు పొంది ఉండాల్సిందేనని బ్యాంకులు నిర్దేశించడం చెల్లదని మద్రాసు హైకోర్టు తేల్చిచెప్పింది. ఏదేనీ కోర్సులో చేరిన విద్యార్థి విద్యా రుణం కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్న సమయంలో సదరు విద్యార్థికి ఇంటర్ లో 60 శాతం మార్కులు వచ్చి ఉంటేనే అర్హత ఉంటుందని బ్యాంకులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధన చెల్లనేరదని మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది. ఇంటర్ లో 59 శాతం మార్కులు సాధించిన రవి అనే విద్యార్థి, చెన్నైలోని ఓ ప్రైవేట్ కళాశాలలో మేనేజ్ మెంట్ కోటా కింద ఇంజినీరింగ్ సీటు పొందాడు. ఆ తర్వాత రుణం కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును సంప్రదించగా, 60 శాతం కంటే తక్కువ మార్కులతో ఇంటర్ పాసయ్యావంటూ రుణం ఇచ్చేందుకు సదరు బ్యాంకు నిరాకరించింది. దీనిపై రవి మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. మార్కుల నిబంధన లేకుండానే రుణం ఇవ్వాల్సిందేనని ఇప్పటికే సింగిల్ జడ్జీ బెంచ్ తీర్పు చెప్పినప్పటికీ బ్యాంకు దారికి రాలేదు. దీంతో బుధవారం ద్విసభ్య బెంచ్ కూడా ఇదే రకమైన తీర్పు చెప్పింది. విద్య కోసం రుణం అన్న పథకం అసలు ఉద్దేశ్యం ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులను ఆదుకోవడమేనని చెప్పిన బెంచ్, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే పథకం లక్ష్యమే నీరుగారిపోతుందని బ్యాంకుకు అక్షింతలు వేసింది.