: మోడీ కంటే ఆమెకు సాకర్ ఫైనలే ఎక్కువట!
భారత ప్రధాని నరేంద్ర మోడీ కంటే కూడా జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కు సాకర్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచే ప్రాధాన్య అంశంగా మారింది. బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్ళే క్రమంలో మోడీ జర్మనీలో ఆగనున్నారు. అక్కడ మెర్కెల్ ను కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిద్దామని ఆయన భావించారు. అయితే, బ్రెజిల్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో జర్మనీ ఫైనల్ చేరింది. ఆదివారం నాడు ఆ మ్యాచ్ జరగనుండడంతో మెర్కెల్ బ్రెజిల్ వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఫైనల్లో జర్మనీ, అర్జెంటీనాతో తలపడనుంది. కాగా, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సదస్సు జూలై 15న బ్రెజిల్లోని ఫోర్టాలెజాలో ప్రారంభం కానుంది.