: మళ్లీ రాజుకున్న బొగ్గు మంటలు
కేంద్రంలో బొగ్గు కుంభకోణంపై మళ్లీ వివాదం రాజుకుంది. కోల్ స్కామ్ పై సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి, గతనెల సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నివేదికను ఇవ్వకుముందే న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్, పీఎంఓ (ప్రధానమంత్రి కార్యాలయం) సీబీఐని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంటూ ప్రచురించిన ఓ ఆంగ్ల కథనం ఈ వివాదానికి కారణమైంది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో ప్రధాన మంత్రిని కాపాడేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ అంశంపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ)తో విచారణ జరిపించాలని బీజేపీ నేత అరుణ్ జైట్లీ డిమాండు చేశారు. సీబీఐని కేంద్ర సర్కార్ స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదని ఆరోపించారు. సీబీఐ చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడమంటే అత్యున్నత న్యాయస్థానాన్ని ధిక్కరించినట్లేనని అన్నారు. అయితే దీనిపై తానేమి వ్యాఖ్యానించబోనని సీబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అన్నారు. మరోవైపు ఆరోపణలను కేంద్రం నుంచి ఎవరూ ఖండించలేదు.