: మోడీ సర్కార్ తొలి కేంద్ర బడ్జెట్ నేడే
2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను మోడీ సర్కార్ నేడు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పై మధ్యతరగతి, పారిశ్రామిక వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. దేశ ఆర్థిక వృద్ధిని పట్టాలపైకి ఎక్కించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచే అవకాశం ఉంది. పన్ను శ్లాబులు, పన్ను మినహాయింపు వర్తించే ఆదాయ పరిమితులను మార్చకపోవచ్చు. బంగారం దిగుమతులపై సుంకాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతుండటం వల్ల... రైతులకు ఉపశమనం లభించే విధంగా బడ్జెట్లో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అడ్డూ అదుపూ లేకుండా ఉన్న ధరలను స్థిరీకరించేందుకు నిధిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.