: ఐపీఎల్ దేశాన్ని ముక్కలు చేస్తోందంటున్న తారామణి
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. సంక్షిప్తంగా ఐపీఎల్. మండే వేసవిలో క్రికెట్ అభిమానుల పాలిట వినోదాల ఒయాసిస్సు. థియేటర్లో మంచి సినిమా ఉంటే సరి లేకుంటే, కుర్రకారు చూపంతా ఐపీఎల్ వైపే. ఒక్కోసారి సినీ పరిశ్రమను సైతం బెంబేలెత్తించే సత్తా ఈ జనరంజక టోర్నీ సొంతం. అంతలా భారత దేశాన్ని ఉర్రూతలూగిస్తోన్న ఈ క్రికెట్ టోర్నీపై బాలీవుడ్ అందాలతార ఇషా కొప్పీకర్ ఏమంటుందో చూడండి.
ఐపీఎల్ వచ్చి దేశాన్ని ముక్కలు చేసిందని ఆమె ఆరోపిస్తోంది. 'భారత జట్టు వరల్డ్ కప్ లో ఆడుతుంటే మన జట్టే గెలవాలని కోరుకుంటా. ఎందుకంటే నేను భారతీయురాలిని కాబట్టి, నా దేశాన్ని ప్రేమిస్తున్నాను గనుక. కానీ, ఐపీఎల్ విషయానికొచ్చేసరికి దేశం ఆయా జట్లుగా విడిపోతుంది, అప్పుడెవరికి మద్దతిస్తాం? నాకిది నచ్చడంలేదు' అని పేర్కొంది. ముంబయిలో ఓ వేడుకలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో ముచ్చటించింది.